Wednesday, 23 October 2024
పెసర పచ్చడి
మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కయ్య ఉండేది.మేమందరమూ ఆమెను మామక్కయ్య అని పిలిచేవాళ్ళము.సాయంత్రం అసురసంధ్య వేళ అయిపోగానే పిల్లలనందరినీ పిలిచేది.వంటింటి వసారాలో మమ్మలనందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని,పెద్ద డీసులో అన్నం,నెయ్యి,పొట్టు పెసరపప్పు పచ్చడి కలిపి కథలు చెబుతూ ముద్దలు పెట్టేది.భలే ఇష్టంగా అందరమూ తినేవాళ్ళము.పొట్టు పెసరపప్పు తీసుకొని,బాణట్లో వెయ్యాలి.కొంచెం నూనె వేసి,రెండు ఎండు మిరపకాయలు వేసి,పచ్చి వాసన పోయి,కొంచెం వేగనివ్వాలి.చల్లారిన తరువాత ఉప్పు వేసి రోట్లో రుబ్బుకోవాలి.
పెసరపప్పుతో వడపప్పు పచ్చడి కూడా చేసుకుంటారు.పెసరపప్పు నానపెట్టుకోవాలి.నానిన తరువాత కొంచెం జీలకర్ర,రెండు మూడు మిరపకాయలు,ఉప్పు వేసి రుబ్బుకోవాలి.కొంత మంది దీనికి నిమ్మకాయ కూడా పిండుకుంటారు.ఇది నిలువ ఉండే పచ్చడి కాదు.అప్పటికప్పుడు తినేసెయ్యాలి.త్వరగా చెడిపోతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment