Wednesday, 16 October 2024

బెండకాయ కూర

బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి అంటారు.నిజమెంతో నాకు తెలియదు.కానీ బెండకాయ కూర తినటం బాగా వచ్చు.ఇప్పుడు చేసుకోవటం కూడా నేర్చుకుందాము.బెండకాయలు బాగా కడిగి,కొంచెం ఆరబెట్టుకోవాలి.లేకపోతే తడి తుడిచెయ్యాలి.లేకపోతే కూర ముద్దగా తడి తడిగా వస్తుంది.కొంచెం కరివేపాకు,కొత్తిమీర సన్నగా తరుగుకోవాలి.బెండకాయలు నాలుగు,ఐదు తీసుకుని తొడిమలు కట్ చేసి,సన్నగా ముక్కలు తరుగుకోవాలి.ఇలా ఎందుకు అన్నానంటే,ఒకటి ఒకటి కోసుకుంటూ పోతే ఎప్పటికి తరగటం పూర్తి అయ్యేది?ఒక్కొక్క సారి నాలుగు అయిదు తీసుకుని కట్ చేస్తే తొందరగా కోసే పని అయిపోతుంది.బాణట్లో నూనె వేసి,ఇంగువ పొడి,పసుపు,ఆవాలు,జీలకర్ర,సెనగబేడలు,మినపపప్పు వేసి వేయించాలి.అవి వేగగానే బెండకాయ ముక్కలు ,కరివేపాకు,కొత్తి మీర ముక్కలు వేసి కలియబెట్టాలి.ఉప్పు కూడా మోయనగా వేసి,ఇంకో సారి కలియబెట్టాలి.కూర ముక్కలు విడివిడిగా రావాలి అనుకుంటే మూత పెట్టకూడదు.కొంచెం తడిపొడిగా ఉన్నా సరే అనుకుంటే,మూత సగం పెట్టాలి.పూర్తిగా పెడితే మరీ ముద్ద ముద్ద అయిపోతుంది.ఎర్రి మంటలు పెట్టకూడదు.అట్లా అని మరీ దీపం బుడ్డి లాగ సన్న మంట పెట్టకూడదు.మధ్యస్థంగా ఉండాలి మంట.మరీ ఎక్కువ మంట పెడితే బయట ముక్క మాడుతూంది,లోపల పచ్చి అలానే ఉంటుంది.బెండ కాయ కూరకు ఊరికూరికినే కలియపెట్టకూడదు.అట్లా చేస్తే ముక్కలు చితికి పోతాయి.పల్చటి కూర గరిటెతో అప్పుడప్పుడూ,తేలికగా కలియపెట్టాలి.బాణలి వెడల్పు ఎక్కువ ఉంటే ముక్కలు విడివిడిగా వస్తాయి.కొంచెం ఒక చుక్క నూనె ఎక్కువ వేసుకుంటే గరగర మని వస్తాయి.ఇంకా అయిదు నిముషాలకు స్టవ్ ఆపేస్తామనగా మిరప్పొడి వేసుకుని కలుపుకోవాలి.అప్పుడు మిరపపొడి పచ్చివాసన ఉండకుండా వుంటుంది. మా అమ్మ చిన్నప్పుడు ఇలా కూడా చేసేది.బెండకాయలను పెద్దపెద్ద ముక్కలుగా తరుగుకోవాలి.నీళ్లలో వేసి,ఒక ఉడుకు రానివ్వాలి.నీళ్లు వంచేసి,బాణట్లో తిరగమాత వేసి,వేగాక ఈ ముక్కలు వెయ్యాలి.కొంచెం చింత పండు నీళ్లు,ఉప్పు,పసుపు,మిరపపొడి వేసి,ఒక అయిదు నిముషాలు వుంచి తీసెయ్యాలి.ఇలా చేసుకోవాలంటే బెండ కాయలు మరీ లేతగా ఉండకూడదు.కొంచెం గట్టిగానే ఉండాలి.లేకపోతే నీళ్లలో ఉడకబెట్టేటప్పుడు మరీ చితికిపోతాయి కదా.

No comments:

Post a Comment