Monday, 21 October 2024
అరటి కాయ కూర
నాకు చిన్నప్పుడు అరటికాయ కూర అంటే చాలా ఇష్టం.దానికి కారణం మా అమ్మ.అంత బాగా చేసేది.అరటికాయ తొక్కు తీసి,చిన్న ముక్కలుగా చేసి నీళ్ళలోకి వేసుకునేది.బొగ్గుల కుంపటి మీద,సన్నటి సెగ పైన వాడ్చేది.కూర ఎంత బాగా వచ్చేది అంటే చెప్పలేను.ప్రతి ముక్క పైన గరగరమంటూ,లోపల వెన్నలాగా ఉండేది కొరికితే.నేను తొందరగా పడుకుంటానని సాయంత్రం ఆరుకే చేసి,నాకు పెట్టేసేది.నేను అలానే చేస్తాను.మొదట అరటికాయలు కడుక్కోవాలి.చెక్కుతీసి,సన్నగా ముక్కలు చేసుకుని,నీళ్లలోకి వేసుకోవాలి.లేకపోతే ముక్కలు నలుపుతిరుగుతాయి.చేతులకు బంక బంకగా అవుతుంది.పరవాలేదు.కొంచెం నూనె రాసుకుంటే చేతులకు తరిగేముందు సరిపోతుంది.సులభంగా కడుక్కోవచ్చు.అదేమీ పెద్ద విషయం కాదు.స్టవ్ వెలిగించి బాణలి స్టవ్ పైన పెట్టుకోవాలి.కొంచెం నూనె వేసి తిరగమాత గింజలు వేసుకోవాలి.అవి వేగిన తరువాత కరివేపాకు సన్నగా తరుగుకుని వెయ్యాలి.సన్నగా తరగమని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి.ఆకులు ఆకులుగా ఉంటే చాలా మంది పక్కకు తీసేస్తారు.అదే సన్నగా ముక్కలకు అతుక్కుపోయి ఉంటే అలాగే తింటారు.కరివేపాకు ఒంటికి మంచిది కదా!ఆ తర్వాత ముక్కలు వేసి,మోయనగా ఉప్పు,పసుపు వేసి కలియబెట్టాలి.ముక్కలు ఒక మోస్తరు మెత్తబడే దాకా మూత పెట్టుకోవచ్చు.ఆ తర్వాత మూత కొంచెం పక్కకు తీస్తే,కూర మరీ అతుక్కోకుండా విడివిడిగా ముక్కలు ఉంటాయి.వెర్రి మంటలు పెడితే కూర మాడుతుంది.కాబట్టి ఒక మోస్తరు సెగపైన ప్రతి 2-3నిముషాలకు కలియబెట్టుకుంటూ ఉండాలి.ఈ మధ్యలో నడుస్తూ ఉంటే,ఒంటికి కూడా మంచిది.కూర ముక్కలు నేను చెప్పినట్లుగా పైన గరగరమంటూ లోపల వెన్నలాగా మెత్తగా ఉండేటప్పుడు,కారంపొడి చల్లి అంతా కలుపుకోవాలి.ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపెయ్యాలి.కానీ రెండు మూడు నిముషాల తర్వాత ఇంకో సారి కలియపెట్టాలి.ఇట్లా చేస్తే అడుగు ముక్కలు బాణలికి అతుక్కోవు,మాడవు.లేదంటే బాణలి తీసి పక్కం పెట్టాలి.వేడి వస్తువులు వూరికినే అటు ఇటూ తిప్పటం,చెయ్యి జారి కిందపడటం,చేతులు కాలటం తగ్గించుకోవచ్చు అని చెబుతున్నాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment