Thursday, 17 October 2024
వంకాయ పచ్చడి
రోటి పచ్చడిగా వంకాయ పచ్చడి బాగుంటుంది.ఈ పచ్చడి మా అత్త ఎట్లా చేస్తుందో చెప్తాను.బొగ్గుల కుంపటి పైన బాగా కడుక్కున్న వంకాయలను ఒకటొకటిగా నూనె రాసి తోలుకు నిప్పులా పైన కాల్చాలి తొడిమ పట్టుకుని.తొక్కు అంతా నల్లగా వాడేటట్లు కాయను అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి.కొంచెంగా బాణట్లో ధనియాలు,మెంతులు,ఆవాలు,ఇంగువ,నాలుగు ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలి.వాటిల్లోకి నాలుగు అయిదు పచ్చి మిరపకాయలు వించి వెయ్యాలి.అవి కూడా ఆ వేడికి మగ్గుతాయి.కొంచెం పసుపు పొడి కూడా వెయ్యాలి.ఇవన్నీ చల్లారిన తరువాత రోట్లో దంచాలి.ఇవన్నీ బాగా మెదిగిన తరువాత వంకాయలను చేతితోనే కొంచెం పిసికి,మరీ నల్లగా బొగ్గులాగా మాడిపోయివుంటే తోలు తీసెయ్యవచ్చు.అట్లనే వేసేసుకున్నా పరవాలేదు.మోయనగా ఉప్పు,రేగుపండు అంత కడిగి నానబెట్టిన చింతపండు వేసి వక్కాముక్కగా దంచుకోవాలి.వంకాయలో వుండే తడి,చింతపండులో వుండే తడి చాలు.ఇంకా నీళ్ళు వెయ్యవద్దు.వేడి వేడి అన్నం లో కలుపుకుంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు చాలా మంది ఇండ్లలో కుంపటి అవీ ఉండవు కదా.అందుకని నేను వంకాయలను నాలుగు ముక్కలు చేసి,కొంచెం నూనె వేసి,ఉప్పు,పసుపు కొంచెం వేసి వాడుస్తాను.ఉప్పు పసుపు వెయ్యకపోతే కాయ కనరు ఎక్కుతుంది.తినలేము.మిక్సీ లో అయితే మరీ ఒకటి రెండు తిప్పులు చాలు.లేకపోతే పచ్చడి మరీ గంధంలా అయిపోయి రుచీ పచీ లేకుండా తయారు అవుతుంది.పంటి కిందకు వంకాయ ముక్క తగులుతుండాలి.అప్పుడే బాగుంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
వంకాయ పచ్చడి బాగుంది 😀ఎక్కువగా తిరుపతి వాళ్ళు వాడే పదాలే వాడావు.మేము ఎక్కువగా వాడే పదాలే అవి.
ReplyDelete