Tuesday, 21 October 2025

రాగి పిండితో లల లాలా

ఈ మథ్య రాగి పిండి వాడకం ఎక్కువ అయింది ఆరోగ్యం పైన అవగాహన ఉన్నవాళ్ళకు. రాగి పిండిలో నీరు కలుపుకుని జారుగా వచ్చేలాగా చేసుకోవాలి.గిన్నెలో నీళ్ళు తెర్ల బెట్టుకోవాలి.నీళ్ళు తెర్లేటప్పుడు పలచగా కలుపుకున్న రాగిపిండిని వెయ్యాలి,కలుపుకుంటూ.అడుగు అంటకుండా,కొంచెంగా సెగ తగ్గించి,కలియ పెడుతూ ఒక పది నిముషాలు తెర్లనివ్వాలి.చల్లారినా జావలాగా,జారుగా ఉండేలా నీరు పోసుకోవాలి.రెండోరోజుకి పులుస్తుంది. పిల్లలకు పాలల్లో కలిపి ఇవ్వవచ్చు మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకుని తాగవచ్చు.లేకపోతే పచ్చి మిరపకాయలు,ఎర్రగడ్డ ముక్కలు,కరివేపాకు,కొత్తిమీర,కొంచెం ఉప్పు వేసుకుని తాగవచ్చు. నేను అయితే పులుసు,చారు,మజ్జిగ అన్నాలు తినేటప్పుడు రెండు చెంచాలు లేక ఒక గరిటడు జావ వేసుకుని తినేస్తాను. అలవాటు ఉన్నవాళ్ళైతే హాయిగా రాగి సంకటి చేసుకుని తినవచ్చు. రాగి సంకటికి ఒకటికి నాలుగు నీళ్ళు పోసుకుని అన్నం ఉడక పెట్టాలి.అన్నం ఉడికింది అని తెలియగానే కలిపి పెట్టుకున్న రాగి పిండి వేసి గట్టిగా కలబెడుతూ ఉండాలి.నీరు బాగా ఇంకేదాకా,ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.చల్లారిన తరువాత ముద్దలుగా చేసుకోవచ్చు.గొడ్డు కారము,పులుసుకూర,పచ్చి పులుసు బాగా ఉంటాయి నంచుకునేదానికి.

Saturday, 2 November 2024

దోస ఆవకాయ

దోస ఆవకాయకు గట్టిగా ఉండే కాయ కావాలి.ఇది మహా ఉంటే ఒక వారం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్కువ చేసుకోపనిలేదు.మట్టసంగా చేసుకుంటే చాలు.దోసకాయ కడిగి,తడి లేకుండా తుడిచి లేక ఆరనివ్వాలి.తరువాత తరిగి లోపల గిజురు తీసివెయ్యాలి.బద్ద చేదు ఉందేమో చూసుకోవాలి.చేదు లేకపోతే,తొక్కుతోటే సన్న సన్న ముక్కలుగా తరుగుకోవాలి.ఒక వెడల్పు గిన్నె లోకి తీసుకుని ఉప్పు,పసుపుపొడి,మిరపపొడి వేసుకోవాలి.ఆవాలు మిక్సీ లో గానీ,రోట్లో గాని పొడి చేసుకోవాలి.ఆవాలు ఒకటి రెండు స్పూన్స్ వేసుకుంటే చాలు.మిరపపొడి ఒక నాలుగు అయిదు స్పూన్స్ వేసుకోవాలి.అన్ని బాగా కలుపుకోవాలి.బాణట్లో నూనె ఒక నాలుగు అయిదు స్పూన్స్ వేసుకుని,ఇంగువ పొడి,ఆవాలు,మెంతులు,రెండు ఎండు మిరపకాయలు తుంచి వేసి,వేయించుకోవాలి.వేగిన తరువాత ముక్కలపైన వేసుకోవాలి.వెంటనే మూత పెట్టకూడదు.కొంచెం చల్ల బడిన తరువాత వేరే జాడీలోకి తీసుకోవాలి.దోసకాయలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు వుండదు.

Friday, 1 November 2024

కొబ్బరి కూర

ఈ కూర మా అమ్మ చేస్తే నాకు చాలా ఇష్టం.ముందుగా కొబ్బెర తురుముకోవాలి.ముదురు కొబ్బెర అయితేనే బాగుంటుంది.మాములుగా కుంపటి పైన కంది పప్పు ఉడక పెట్టుకునే పని అయితే,బద్దలు మెత్త బడగానే పక్కకు తీసేసుకోవాలి.కుక్కర్ లో అయితే కందిపప్పు తడుపుకొని,ఒకటి రెండు స్పూన్స్ నీళ్ళు పోసుకోవాలి.కుక్కర్ లో అన్నం,పప్పు,కూర అన్నీ ఉడకబెట్టుకుంటుంటాము కదా,ఒక వెడల్పు ప్లేటు లేక చిన్న గిన్నెలో కొంచెంగా నీళ్ళు పోసి పెట్టుకుంటే పప్పు మెత్తబడినా,విడివిడిగా బద్దలుగానే ఉంటుంది.ఇప్పుడు బాణట్లో తిరగమాత వేసుకుని,కొబ్బెర తురుము,కొంచెం ఉప్పు,పసుపుపొడి వేసుకుని కలియపెట్టాలి.కొంచెం కొబ్బెర పచ్చి వాసన పోగానే,ఉడకబెట్టుకున్న కందిపప్పు బద్దలు వేసి కలియపెట్టాలి.ఇంకో రెండు మూడు నిముషాలు అయిన తరువాత మిరపపొడి ఒక అర స్పూన్ వేసి కలిపి,కూరను పక్కకు తీసేసుకోవాలి బాణట్లోనుంచి.

Monday, 28 October 2024

సెనగబేడల పచ్చడి

మా పెద్దన్నయ్యకు తినేసెనగపప్పు పచ్చడి ఎక్కువ నచ్చేది కాదు.అప్పట్లో మాకు వేరుశెనగపప్పు పచ్చడి అసలు అలవాటు ఉండేది కాదు.అందుకని మా అమ్మ పచ్చి సెనగబేడలతో పచ్చడి చేసేది ఇడ్లీ దోశలలోకి.సెనగబేడలు,నాలుగు అయిదు ఎండు మిరపకాయలు ఒక చుక్క నూనె వేసి వేయించుకోవాలి.పచ్చి కొబ్బెర ఉంటే వేసుకోవచ్చు.ఎండు కొబ్బెర ఉంటేవేయించిన గింజల పైన వేస్తే ఆఖరున పచ్చి వాసన పోతుంది.చల్లారిన తరువాత సరిపడ ఉప్పు వేసుకొని,రోట్లో రుబ్బుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు చిలకరించుకుంటూ.లేదంటే మిక్సీ లో రుబ్బుకోవచ్చు.టిఫిన్స్ లోకి బాగుంటుంది.నిలవ ఉండదు.ఏ పూటకాపూట చేసుకోవాలి.తిరగమాతకు ఒక ఎండు మిరపకాయ ,సెనగబేడలు,మినపపప్పు,ఆవాలు,జీలకర్ర కొంచెం కొంచెం వేసుకుని తీసుకొని వేయించుకోవాలి.

Sunday, 27 October 2024

పెరుగన్నం

అన్నం లో పెరుగు,ఉప్పు కలుపుకుని,పక్కన ఉప్పు నిమ్మకాయ ఊరగాయ లేకపోతే కందిపచ్చడి నంచుకుంటే సరిపోతుంది.కానీ దేవుళ్ళకు నైవేద్యం పెట్టడానికి పెరుగన్నం చేస్తాము.ఇది ఇంకా బాగుంటుంది.అన్నం చల్లార్చుకోవాలి వెడల్పు గిన్నెలో.ఒక గ్లాస్ బియ్యానికి రెండున్నర నీళ్ళు పోసుకోవాలి వండడానికి.అన్నం వేడి పైన పెరుగు వెయ్యకూడదు.చల్లారిన అన్నం లోకి ఉప్పు,పెరుగు వేసి బాగా కలియపెట్టాలి.తగినంత పెరుగు వేసుకోవాలి.తరువాత కొంచెం నీళ్ళు,కొంచెం కాచీ చల్లారిన పాలు పోసుకోవాలి.ఇట్లా చేస్తే పెరుగన్నం కొంచెం గట్టి పడుతుంది,తొందరగా పులవదు.అల్లం,పచ్చి మిరపకాయలు,కరివేపాకు,కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి.తిరగమాత లోకి ఆవాలు,జీలకర్ర,రెండు ఎండు మిరపకాయలు,మినపప్పు,సెనగబేడలు.వేరు సెనగ గింజలు,ముంతమామిడి పప్పువేసుకోవాలి.నైవేద్యం కాకుండా వూరికినే ఇంట్లో తినేదానికి అయితే ఎండు మిరపకాయలు బదులు ఉప్పు మిరపకాయలు వేయించి వేసుకోవచ్చు. కొంత మంది పెరుగన్నం లోకి సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుంటారు.ఇంకొంత మంది దానిమ్మ గింజలు,ద్రాక్ష కలుపుకుంటారు.

Friday, 25 October 2024

చేమ గడ్డ కూర

చేమగడ్డకూర నేను ఎలా చేస్తానో చెపుతాను.మొదట చేమగడ్డలు బాగా నీళ్ళలో నానబెట్టి,కడుక్కోవాలి.ఎందుకంటే మట్టి బాగా ఉంటుంది ఈ గడ్డలకు.ఎక్కువగా ఎర్రమట్టి బంకలుగా ఉంటుంది కాబట్టి బాగా నానితే కానీ,పూర్తిగా మురికి పోదు.పాత రోజుల్లో గోతాములో వేసి ,నేలకేసి బాదేవాళ్ళము.తరువాతగట్టిగా రుద్ది,పైన మట్టి,తోలు తీసేవాళ్ళము.ఇప్పుడు అట్లా ఎవరూ చెయ్యరు.ఇప్పుడు ఇంక కుక్కర్లోకి తీసుకొని ఉడకబెట్టుకోవాలి.మూడు విజిల్స్ వస్తే చాలు.చల్లారిన తరువాత కుక్కర్ మూత తీసి,చెమగడ్డలని నీళ్ళలోనుంచి తియ్యాలి.చల్లారిన తరువాత గడ్డలపైన చెక్కు తీసుకోవాలి.ఈ లోపల కొంచెం చింతపండు నానబెట్టుకొని,గుజ్జు తీసిపెట్టుకోవాలి.బాణట్లో తిరగమాత వేసి,వేగిన తరువాత సన్నగా తరిగిన కరివేపాకు,కొత్తి మీర.పసుపు వెయ్యాలి.తరువాత తొక్కు తీసిన గడ్డలను కొంచెం చిదుముతూ వెయ్యాలి.ముక్కలను బాగా కలియ పెట్టాలి.ఇప్పుడు మోయనగా ఉప్పు,మిరపపొడి,చింతపండు రసం వెయ్యాలి.బాగా ఒక అయిదు నిముషాలు వేగనివ్వాలి.మనం ఇనుప బాణలి వాడేటట్లయితే,చల్లారేలోపల తీసి వేరే గిన్నెలోకి మార్చుకోవాలి.కొంచెం కూర పొడి వేసుకుంటే వేసుకోవచ్చు.లేకపోయినా బాగుంటుంది.

Thursday, 24 October 2024

టీ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు

ఈ మధ్య కాఫీ కంటే టీ మంచిది అని చాలా మంది అర్థం చేసుకున్నారు.నాకు తెలిసి మా చిన్నప్పుడు మా ఇండ్లలో టీ ఎవరూ పెట్టేవాళ్ళు కాదు.తరువాత మొదలు అయింది.ఇంట్లో పెట్టుకుంటే చిక్కటి పాలతో పెట్టుకునే దానికి ఇష్టపడతాము.ఒక వేళ పాలు మరీ చిక్కన అయితే కొంచెం నీళ్ళు పోస్తాము.పాలలోనే టీ పొడి వేసి తెర్లనిస్తాము.ఒక అయిదు నిముషాలు తెర్లిన తర్వాత వడగట్టి,చక్కెర తగినట్టుగా వేసుకుంటాము.అయితే ఈ టీ చాలా రకాలుగా చేస్తారు.చాలా మంది పాలు నీళ్ళు ఒకటికి ఒకటిగా వాడుతారు.మొదట నీళ్ళు పొయ్యి పైన తెర్లనిస్తాము.దాంట్లో టీ పొడి,రెండు ఏలకులు,కొంచెం అల్లం వేసి ఇంకా తెర్లనిస్తాము.అప్పుడు పాలు పోసి ఇంకొంచెం బాగా మరగనిస్తాము.తరువాత వడగట్టుకుంటాము.ఈ మధ్య చక్కెర వాడకం చాలా మంది తగ్గించేశారు.బ్రౌన్ షుగర్,లేకపోతే బెల్లం వేసుకుంటారు.నేను అయితే అసలు ఇవేవీ వేసుకోను.అలానే తాగేస్తాను.నేను టీ లోకి మిరియాలు దంచి వేసుకుంటాను.ఈ మధ్య తులసి ఆకులు,లేకపోతే పొదిన ఆకులు కూడా వేసుకుంటున్నాను.నాకు నచ్చుతుంది.కొంత మంది పసుపుపొడి కూడా వేసుకుంటున్నారు.మావాళ్ళు ఈ మధ్య పాలు ఒకటికి నీళ్ళు మూడు పోస్తున్నారు.పాలు శాతం తగ్గిస్తే మంచిది అని.